తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 10 రోజుల పాటు తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రానికి రెడ్ అలర్ట్ ప్రకటించింది.
వాతావరణ శాఖ ప్రకారం, ఏప్రిల్ 12 నుంచి ఏప్రిల్ 22 వరకు ఈ తీవ్ర వడగాలుల ప్రభావం కొనసాగనుంది. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు వంటి ఉత్తర, తూర్పు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 44°C నుంచి 45°C వరకు చేరే అవకాశం ఉందని అంచనా వేయబడింది.
రాజధాని హైదరాబాద్లో కూడా ఉష్ణోగ్రతలు 40°C దాటే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వడదెబ్బ తగలకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు.












