ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా ఎలమంచిలి పరిసర ప్రాంతాల్లో శుక్రవారం అర్ధరాత్రి స్వల్ప భూకంపం సంభవించింది. ఈ ప్రకంపనలు స్థానికులను భయాందోళనకు గురిచేశాయి.
రాత్రి 12:30 గంటల సమయంలో సంభవించిన ఈ భూకంపం కొన్ని సెకన్ల పాటు కొనసాగింది. ఎలమంచిలి పట్టణంతో పాటు రాంబిల్లి మండలం పరిధిలోని పలు గ్రామాల్లో భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు.
అధికారుల ప్రాథమిక సమాచారం ప్రకారం, భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.7గా నమోదైంది. నిద్రలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ప్రస్తుతం వరకు ఎటువంటి ఆస్తి నష్టం గానీ, ప్రాణ నష్టం గానీ జరిగినట్లు నివేదికలు లేవు. స్థానిక యంత్రాంగం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) బృందాలు భూకంపానికి గల కారణాలను అంచనా వేస్తున్నాయి. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.











