సంగారెడ్డి జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. రోడ్డు భద్రతపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు ఆయన సూచనలు చేశారు.
కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం జరిగిన ఈ సమావేశంలో, జిల్లా ఎస్పీ పరతోష్ పంకజ్‌తో కలిసి కలెక్టర్ రోడ్డు భద్రతా చర్యలపై సమీక్షించారు. ముఖ్యంగా నేషనల్ హైవే–65 పై నిర్వహణ లోపంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
యూ-టర్న్‌ల వద్ద భద్రతా చర్యలు, లైటింగ్, రేడియం సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, అలాగే జంక్షన్ల వద్ద పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. చేవెళ్ల ఘటన నేపథ్యంలో సీజ్ చేసిన వాహనాల వివరాల నివేదికను జిల్లా రవాణా అధికారి సమర్పించాలని కోరారు.
నేషనల్ హైవేలు, ప్రధాన రహదారులపై పారిశుద్ధ్య నిర్వహణను సక్రమంగా చేపట్టాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. పోలీసు శాఖ రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ తెలిపారు.
హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగంపై నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, ఆర్ & బి, పోలీస్, మున్సిపల్, హెల్త్ శాఖల అధికారులు, నేషనల్ హైవే ప్రతినిధులు పాల్గొన్నారు.












