రోడ్డు ప్రమాదాల్లో యువత ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకరమని, రోడ్డు భద్రతా నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని రాష్ట్ర అడిషనల్ డీజీపీ (సీఐడీ & ఏసీబీ) చారు సిన్హా అన్నారు. కరీంనగర్లో నిర్వహించిన ‘అరైవ్ అలైవ్’ అవగాహన సదస్సులో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’లో భాగంగా, డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు భద్రతా వారోత్సవాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా కరీంనగర్ జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో, పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం పర్యవేక్షణలో ‘అరైవ్ అలైవ్’ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చారు సిన్హా ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అడిషనల్ డీజీపీ మాట్లాడుతూ, ప్రమాదాల నివారణకు ‘డిఫెన్సివ్ డ్రైవింగ్’ కీలకమని, నిర్లక్ష్యం వల్ల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో సీటు బెల్ట్ వాడాలని, ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్ చేస్తూ సెల్ ఫోన్ మాట్లాడటం వంటివి నేరాలని హెచ్చరించారు.
సదస్సులో మెడికవర్ ఆసుపత్రి వైద్య బృందం సీపీఆర్ (CPR) విధానంపై ప్రత్యక్ష ప్రదర్శన ఇచ్చింది. మాక్స్ విజన్ కంటి ఆసుపత్రి సహకారంతో విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు, పలువురు విద్యార్థులకు హెల్మెట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, పలువురు ఏసీపీలు, మెడికవర్ ఆసుపత్రి వైద్యులు, ఇన్స్పెక్టర్లు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.











