రాష్ట్రవ్యాప్తంగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్-2026) కార్యక్రమం పారదర్శకంగా, లోపాలు లేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇంటింటి సర్వే, ముసాయిదా జాబితా ప్రచురణ, తుది జాబితా విడుదల తేదీలను ఖరారు చేశారు.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా, జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు (బీఎల్వోలు) ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసి, తిరిగి సేకరిస్తారని తెలిపారు. ఓటరు జాబితా ఖచ్చితత్వం కోసం ఈ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
రాజకీయ పార్టీల ప్రతినిధులతో తరచూ సమావేశాలు నిర్వహించి, వారి సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు సూచించారు. బీఎల్వోలకు జూన్ 23న జుక్కల్లో ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. విధుల్లో ఉన్నప్పుడు బీఎల్వోలు తప్పనిసరిగా గుర్తింపు కార్డులు ధరించాలని స్పష్టం చేశారు.
జూలై 24లోగా పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పూర్తిచేసి, జూలై 31న ముసాయిదా ఓటరు జాబితాను ప్రచురిస్తామని తెలిపారు. అనంతరం అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన ప్రక్రియ పూర్తయిన తర్వాత అక్టోబర్ 1న తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో ఉన్న ఓటర్ల నమోదుపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఒకే కుటుంబానికి చెందిన ఓటర్లందరూ ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఓటరు జాబితా సవరణ కార్యక్రమంపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడానికి మీడియా, సోషల్ మీడియా, బ్యానర్లు, హోర్డింగ్ల ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.












