తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ రైతు బజార్లు, మార్కెట్లలో ప్లాస్టిక్ పూల అమ్మకాలపై నిషేధం విధించింది. ఈ మేరకు మార్కెటింగ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మార్కెట్లలో ప్లాస్టిక్ పూల విక్రయాలను నిషేధిస్తూ మార్కెటింగ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలను పాటించని వారిపై లైసెన్స్ రద్దుతో సహా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. సహజ పూలు, వాటి ఉత్పత్తులను మాత్రమే మార్కెట్లలో విక్రయించాలని ఆదేశించారు.
ప్రభుత్వ మార్కెట్లలో ప్లాస్టిక్ పూల అమ్మకాలు అధికమవుతున్నాయని, దీనివల్ల సహజ పూల వ్యాపారులకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని పలువురు వ్యాపారులు ఫిర్యాదు చేశారు. ఆదాయం తగ్గిపోవడంతో వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమస్యపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. ఇటీవల రైతు మేళాల్లో వ్యాపారులు తమ సమస్యలను మంత్రితో చర్చించారు. వారి విజ్ఞప్తి మేరకు మంత్రి తక్షణ చర్యలకు ఆదేశించారు.
ఈ నిషేధం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ రైతు బజార్లు, మార్కెట్లకు వర్తిస్తుంది. సహజ పూల విక్రయాలను ప్రోత్సహించడమే ఈ నిర్ణయం వెనుక ముఖ్య ఉద్దేశ్యంగా తెలుస్తోంది.











