లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని పరిగి ఎమ్మెల్యే కోతుకుంట్ల రామ్మోహన్ రెడ్డి కలిశారు. తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో తనకు ఒక స్థానం కల్పించాలని ఆయన కోరారు. ఈ మేరకు రాహుల్ గాంధీకి వినతిపత్రం సమర్పించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
తెలంగాణ కేబినెట్లో ప్రస్తుతం మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయని, రంగారెడ్డి జిల్లా నుంచి ఎటువంటి ప్రాతినిధ్యం లేదని రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గతంలో రంగారెడ్డి జిల్లాకు ముగ్గురు నుంచి ఆరుగురు మంత్రులు ఉండేవారని ఆయన గుర్తు చేశారు. డీలిమిటేషన్ అనంతరం జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ స్థానాలు పెరిగే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో తాను మంత్రి పదవి ఆశిస్తున్నట్లు తెలిపారు.
తన కుటుంబం మూడు తరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే పనిచేస్తోందని, బూత్ స్థాయి నుంచి పార్టీ కోసం కృషి చేశానని ఎమ్మెల్యే వివరించారు. తాను నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశానని, పార్టీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో పనిచేసినట్లు పేర్కొన్నారు.
రాహుల్ గాంధీకి సమర్పించిన వినతిపత్రంపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు రామ్మోహన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో మాట్లాడి తనకు మంత్రి పదవి వచ్చేలా రాహుల్ గాంధీ అవకాశం కల్పిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ భేటీలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తన రాజకీయ నేపథ్యాన్ని, పార్టీకి చేసిన సేవలను వివరించినట్లు సమాచారం.











