పరిగి ఎమ్మెల్యే కొడంగల్ రామ్మోహన్ రెడ్డి, లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి, తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో తనకు చోటు కల్పించాలని కోరారు.
రాహుల్ గాంధీకి వినతిపత్రం సమర్పించిన ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, తెలంగాణ కేబినెట్లో మూడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయని, రంగారెడ్డి జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేదని, దీనివల్ల తనకు మంత్రి పదవి రావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. గతంలో రంగారెడ్డి జిల్లాకు పలువురు మంత్రులు ఉండేవారని, డీలిమిటేషన్లో నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
తన కుటుంబం మూడు తరాలుగా కాంగ్రెస్ పార్టీతో అనుబంధం కలిగి ఉందని, తాను బూత్ స్థాయి నుంచి పార్టీ కోసం పని చేశానని, నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశానని రామ్మోహన్ రెడ్డి వివరించారు. పార్టీ అధికారంలోకి రావాలనే లక్ష్యంతో కృషి చేశానని తెలిపారు.
రాహుల్ గాంధీ తన అభ్యర్థనపై సానుకూలంగా స్పందించారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలు తన మంత్రి పదవి విషయంలో రాహుల్ గాంధీతో మాట్లాడి అవకాశం కల్పిస్తారని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.










