జిల్లాలో ఆరోగ్య సేవలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో నిర్మిస్తున్న నూతన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జిజిహెచ్) భవన నిర్మాణ పనులు, మెడికల్ కళాశాలలో స్పోర్ట్స్ వసతుల అభివృద్ధిని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య గురువారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.
273 కోట్ల రూపాయల విలువైన నూతన జిజిహెచ్ భవన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పాత భవనంలోని వంద పడకలు, టీ–హబ్ లను తరలించి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. నాణ్యతతో కూడిన పనులు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
మెడికల్ కళాశాలలో సీఎస్ఆర్ నిధుల ద్వారా జరుగుతున్న క్రీడా అభివృద్ధి పనులను కూడా కలెక్టర్ సమీక్షించారు. ఈ స్పోర్ట్స్ సదుపాయాలను మూడు నెలల్లోపు పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. విద్యార్థుల శారీరకాభివృద్ధికి, ఆరోగ్య పరిరక్షణకు, క్రీడా ప్రతిభ పెంపొందించడానికి ఈ సదుపాయాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.
జిజిహెచ్ లోని యూడీఐడి వార్డు, కేన్సర్ డే కేర్ సెంటర్ను కూడా కలెక్టర్ ప్రత్యేకంగా పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. జిల్లాలో వైద్య సేవల స్థాయిని మరింత ఉన్నతంగా తీసుకెళ్లేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ వసంతరావు, జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


