కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో అర్ధరాత్రి దారితప్పిన ఓ వృద్ధురాలికి పోలీసులు అండగా నిలిచి, మానవత్వాన్ని చాటుకున్నారు. ఆమెకు సకాలంలో వైద్య సహాయం అందించి, సురక్షితంగా బంధువుల చెంతకు చేర్చారు.
ధర్మారావుపేట్ గ్రామ వీధుల్లో రాత్రిపూట దారి తప్పి, మతిస్థిమితం సరిగా లేక అయోమయంగా తిరుగుతున్న సుమారు 60 ఏళ్ల వృద్ధురాలి సమాచారం డయల్ 100 ద్వారా సదాశివనగర్ పోలీసులకు అందింది. సమాచారం అందిన వెంటనే, నైట్ పెట్రోలింగ్ విధుల్లో ఉన్న కానిస్టేబుల్ ఇసాక్, రంజిత్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
వృద్ధురాలిని గుర్తించిన పోలీసులు, ఆమె ముఖంపై గాయాలతో భయంతో వణికిపోతుండటాన్ని గమనించారు. వెంటనే ఆమెను దగ్గరకు తీసుకుని ఓదార్చి, స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ స్వయంగా దగ్గరుండి వైద్యం చేయించి, ధైర్యం చెప్పారు.
చికిత్స అనంతరం, వృద్ధురాలి బంధువుల కోసం పోలీసులు ఆరా తీశారు. ఎట్టకేలకు వారిని సంప్రదించి, పూర్తి వివరాలు తెలియజేసి, సావిత్రిని సురక్షితంగా వారి చెంతకు చేర్చారు. అర్ధరాత్రి వేళ, గాయాలతో, ఒంటరిగా మిగిలిన వృద్ధురాలికి పోలీసులు కొడుకుల్లా అండగా నిలిచారు.
ఈ సంఘటన సదాశివనగర్ పోలీసుల మానవతా దృక్పథాన్ని, బాధ్యతాయుతమైన సేవను తెలియజేస్తోంది.












