రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతుల ఖాతాల్లోకి నేరుగా నిధులు జమ అవుతున్నాయని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ పథకం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించినదని ఆయన పేర్కొన్నారు.
రామారెడ్డి మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి నిధులు జమ చేసిన విషయాన్ని తెలియజేశారు. రైతుల పెట్టుబడి వ్యయభారాన్ని తగ్గించడం, సకాలంలో ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం ముఖ్య లక్ష్యాలని ఆయన వివరించారు.
జిల్లాలో 2025–26 వానాకాలం సీజన్లో 10,851 మంది రైతులకు రూ.9.35 కోట్లకు పైగా, యాసంగి సీజన్లో 10,950 మంది రైతులకు రూ.7.34 కోట్లకు పైగా రైతు భరోసా నిధులు జమైనట్లు కలెక్టర్ వెల్లడించారు. రెండు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు వెంటనే నిధులు జమ అవుతాయని, మిగిలిన వారికి తొమ్మిది రోజుల్లో విడతల వారీగా జమ చేస్తామని తెలిపారు.
అర్హులైన ప్రతి రైతుకు పథకం ప్రయోజనం అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని, దరఖాస్తుల పరిశీలన, అర్హత నిర్ధారణ, నిధుల జమ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు.
రైతులు ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకుని, ఆధునిక సాగు పద్ధతులు అవలంబించి ఉత్పాదకతను, దిగుబడులను పెంచుకోవాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు పాల్గొన్నారు.












