లోక్‌సభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆయనపై తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారంటూ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదు నమోదైంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పాకిస్థాన్ ఏర్పాటుతో లేదా దేశ విభజనతో పోల్చడాన్ని శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. వందలాది మంది ప్రాణత్యాగాలు, దశాబ్దాల పోరాటాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణను అవమానించడం రాష్ట్ర ప్రజల మనోభావాలను గాయపరచడమేనని ఆయన పేర్కొన్నారు.
పార్లమెంటులో బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, ఒక రాష్ట్రం పట్ల ఇంతటి వివక్షతో కూడిన వ్యాఖ్యలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. చారిత్రక ఘట్టాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం తక్కువ చేసి చూపడం సరికాదని ఆయన వాదించారు.
తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచిన ఎంపీ తేజస్వి సూర్యపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ గౌడ్ పోలీసులను కోరారు. 'తెలంగాణ అంటే పోరాటాల గడ్డ' అని, అలాంటి పవిత్రమైన ఉద్యమ ఫలితాన్ని పాకిస్థాన్‌తో పోల్చడం తేజస్వి సూర్య అజ్ఞానానికి పరాకాష్ట అని ఆయన ధ్వజమెత్తారు. ఎంపీ వెంటనే తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ సంఘటనపై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో కూడా ఎంపీ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు.











