తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అవమానిస్తున్న బీజేపీ ఎంపీ తేజస్వి సూర్యపై టీబీజేపీ ఎంపీలు మౌనంగా ఉండటంపై ప్రభుత్వ విప్ వేముల వీరేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర ప్రజలను, అమరవీరులను అవమానించడమేనని ఆయన అన్నారు.
శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ విభజనను అవమానిస్తూ బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలను వీరేశం ఖండించారు. ఈ సందర్భంగా టీబీజేపీ ఎంపీల మౌనంపై ఆయన ప్రశ్నించారు. 'తల్లిని చంపి బిడ్డను బతికించార'ని ప్రధాని మోదీ గతంలో అన్న మాటలను గుర్తు చేసిన వీరేశం, ఇప్పుడు బీజేపీ ఎంపీలు తెలంగాణను ఎందుకు అవమానిస్తున్నారని నిలదీశారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి కాబట్టే మాట్లాడరని, అయితే మిగతా తెలంగాణ ఎంపీల మౌనం వెనుక కారణమేంటని ఆయన ప్రశ్నించారు. ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలు రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులను కూడా అవమానించినట్లేనని వీరేశం అన్నారు.
బీజేపీ సిద్ధాంతం ఇదేనా అని రాష్ట్ర బీజేపీ నాయకులు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఇదే బీజేపీ విధానమైతే, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు.
ఎంపీ తేజస్వి సూర్య స్వతహాగా మాట్లాడలేదని, బీజేపీ నాయకులు కావాలనే తెలంగాణ రాష్ట్రంపై విమర్శలు చేయించారని వీరేశం ఆరోపించారు. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు బీజేపీకి బుద్ధి చెబుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.











