రాష్ట్రవ్యాప్తంగా డయాలసిస్ సేవల బలోపేతానికి ప్రజా ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆదేశాల మేరకు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో అధికారులు చర్యలు ప్రారంభించారు. జిల్లాలో కొత్త డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు, ఇప్పటికే ఉన్న కేంద్రాల్లో అదనపు పడకల కేటాయింపుపై జిల్లా వైద్యాధికారి బృందం శనివారం క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించింది.
జిల్లా వైద్యాధికారి డా. సి. ఉమా గౌరి నేతృత్వంలోని బృందం, జిల్లా హాస్పిటల్ సర్వీసెస్ కోఆర్డినేటర్ డా. సునీత, కుత్బుల్లాపూర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ డా. రాధలతో కలిసి ఘట్కేసర్, శామీర్‌పేట్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను సందర్శించి, మౌలిక వసతులను సమీక్షించింది.
కొత్త డయాలసిస్ కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన స్థల విస్తీర్ణం, ప్రతి పడకకు అవసరమైన ప్రదేశం, అంటువ్యాధులున్న రోగుల కోసం ప్రత్యేక విభాగాలు, రోగుల సహాయకుల కోసం వేచి ఉండే ప్రదేశాలపై అధికారులు దృష్టి సారించారు. ఆక్సిజన్ సరఫరా, నిరంతర విద్యుత్, తాగునీరు, టెలీ-డయాగ్నస్టిక్స్, హై-స్పీడ్ ఇంటర్నెట్ వంటి సాంకేతిక సదుపాయాలను కూడా పరిశీలించారు.
కేంద్రాల నిర్వహణకు అవసరమైన వైద్యులు, ఫిజీషియన్లు, అనస్తీషియాలజిస్టుల లభ్యతపై సమీక్ష జరిగింది. సెక్యూరిటీ, శానిటేషన్, రోగుల సంరక్షణ సిబ్బంది షిఫ్ట్‌ల వారీగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ చర్యలన్నీ డయాలసిస్ రోగులకు వారి నివాస ప్రాంతాల వద్దనే నాణ్యమైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో చేపడుతున్నారు.
డా. సి. ఉమా గౌరి మాట్లాడుతూ, సివిల్ పనులు, మరమ్మత్తులు, సిబ్బంది నియామకాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి త్వరలో ఉన్నతాధికారులకు సమర్పిస్తామని తెలిపారు. ఈ తనిఖీల ఆధారంగా కేంద్రాల ప్రారంభానికి సంబంధించిన కాలపరిమితి, అవసరమైన మరమ్మత్తులపై పూర్తి నివేదికను ప్రభుత్వం పరిశీలించనుంది.











