జూన్ 7వ తేదీలోగా మొక్కజొన్న సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన సదాశివనగర్ మండలం పద్మాజీవాడి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, కొనుగోలు పురోగతిని సమీక్షించారు.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పద్మాజీవాడి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, కొనుగోలు, రవాణా ప్రక్రియలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు 18,840 క్వింటాళ్ల మొక్కజొన్న కొనుగోలు చేయగా, 15,000 క్వింటాళ్లు గోదాములకు తరలించినట్లు అధికారులు వివరించారు. ప్రస్తుతం కేంద్రం వద్ద 3,840 క్వింటాళ్ల మొక్కజొన్న నిల్వ ఉందని, మరో 16 కుప్పల నుంచి సుమారు 3,000 సంచుల కొనుగోలు జరిగే అవకాశం ఉందని తెలిపారు.
రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్న కలెక్టర్, జూన్ 7లోగా సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని డీఎం మార్క్‌ఫెడ్‌ను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వేగంగా గోదాములకు తరలించాలని సూచించారు. రైతులకు మద్దతు ధర ప్రయోజనాలు అందేలా చూడాలని, కొనుగోలు కేంద్రాల్లో పారదర్శకత పాటించాలని అధికారులకు సూచించారు.
రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, డీసీఓ, డీఎం మార్క్‌ఫెడ్, డీసీఎస్ఓ, డీఎం (సివిల్ సప్లైస్), తహసీల్దార్, ఎంపీడీవో, ఎంఏఓ, మానిటరింగ్ అధికారి, పీఏసీఎస్ అధ్యక్షులు, సర్పంచ్, వార్డు సభ్యులు, పీఏసీఎస్ కార్యదర్శి, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.












