లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సీట్ల పెంపు, పునర్విభజన ప్రక్రియ జీఎస్డీపీ (GSDP) ఆధారిత హైబ్రీడ్ మోడల్లో జరగాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. మహిళల రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు తెలిపారు, అయితే కేంద్రం ప్రతిపాదించిన పెంపు విధానం దక్షిణాది రాష్ట్రాలకు నష్టం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సీట్ల పెంపు, పునర్విభజన ప్రక్రియ జీఎస్డీపీ (GSDP) ఆధారిత హైబ్రీడ్ మోడల్లో జరగాలని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్ల రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయడానికి సంపూర్ణ మద్దతునిస్తామని, అయితే లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల పెంపునకు కేంద్రం ప్రకటించిన ప్రాతిపదిక దేశంలోని ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య అంతరాన్ని పెంచడమే కాకుండా దేశానికి ప్రమాదకరంగా మారుతుందని ఆయన హెచ్చరించారు.
కేంద్రం ప్రతిపాదించిన నియోజకవర్గాల పెంపునకు ప్రతిగా, ముఖ్యమంత్రి గారు జీఎస్డీపీ ఆధారిత హైబ్రీడ్ మోడల్‌ను ప్రతిపాదించారు. ప్రస్తుత 543 లోక్‌సభ స్థానాల్లో పెంచాలనుకుంటున్న 50 శాతం అంటే 272 స్థానాల్లో 136 సీట్లను ప్రొరేటా ప్రకారం, మిగిలిన 136 సీట్లను జాతీయ స్థూల ఉత్పత్తి (GSDP) ప్రాతిపదికన విభజించి, అత్యధిక శాతం అందిస్తున్న రాష్ట్రాలకు ప్రాధాన్యతనివ్వాలని ఆయన సూచించారు. ఈ నెల 16 నుంచి నిర్వహించే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లతో పాటు నియోజకవర్గాల పెంపు బిల్లును హడావిడిగా ఆమోదించాలని ప్రయత్నిస్తున్నారని, అయితే ఈ రెండు వేర్వేరు అంశాలని, ఒకదానికి ఇంకొకటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఎలాంటి ప్రాతిపదిక లేకుండా ఏకపక్షంగా లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీల్లో ప్రస్తుతం ఉన్న సీట్లకు దామాషా ప్రకారం 50 శాతం లెక్కన నియోజకవర్గాల సంఖ్యను పెంచితే దక్షిణాది రాష్ట్రాలు వివక్షకు గురవుతాయని, ఈ ప్రక్రియ వల్ల దేశంలో అనవసరమైన గందరగోళం ఏర్పడుతుందని, కొన్ని చిన్న రాష్ట్రాల మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పెంపుపై ముందుగా విధివిధానాలు ఖరారు చేయాలని, అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకోవాలని, రాష్ట్రాల శాసనసభల అభిప్రాయాలను తెలుసుకోవాలని, ఈ అంశంపై నిపుణుల కమిటీని నియమించి, వారి నివేదికపై పార్లమెంట్లో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
నియోజకవర్గాల పెంపు – పునర్విభజనకు సంబంధించి కేంద్రం తాజా నిర్ణయంపై ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క గారు, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ధనసరి అనసూయ సీతక్క గారు, వాకిటి శ్రీహరి గారు, ప్రభుత్వ సలహాదారు కేశవరావు గారు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. మహిళలకు రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవని, నూటికి నూరు శాతం సంపూర్ణంగా మద్దతునిస్తున్నామని తెలిపారు. 2023లో ఈ బిల్లు ముందుకొచ్చినప్పుడు సంపూర్ణంగా మద్దతునిచ్చామని, 2026లో చేపట్టే జనాభా లెక్కల తర్వాత అమలు చేయడంలో చిన్న అడ్డంకిని సవరించి ఉంటే బాగుండేదని అన్నారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాది రాష్ట్రాలకు తీరని విఘాతం కలుగుతుందని, చిన్న రాష్ట్రాలు రాజకీయంగా ద్వితీయశ్రేణి రాష్ట్రాలుగా మిగిలిపోతాయని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు దేశ మనుగడకు మంచిది కాదని, ఇది రాజకీయ పార్టీలకు సంబంధించిన అంశం కాదని, దేశ ప్రజలకు సంబంధించిన అంశమని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు ఆర్థిక రాజధానులుగా, ఉత్తరాధి రాష్ట్రాలు రాజకీయ రాజధానులుగా మారకూడదని ఆయన అన్నారు. సీట్లు పెంచాలనుకుంటే ఏ ప్రాతిపదికన, ఎన్ని పెంచాలన్నది అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. హైబ్రీడ్ మాడల్‌లో 136 సీట్లు ప్రొరేటా ప్రకారం, మరో 50 శాతం సీట్లు దేశ స్థూల ఆర్థిక ఉత్పత్తి ప్రాతిపదికన ఇవ్వాలని ప్రతిపాదించారు.









