తెలంగాణను త్రీ ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. శుక్రవారం కొండాపూర్ మండలం తొగర్‌పల్లిలో రూ.650 కోట్ల పెట్టుబడితో భారీ ఫుడ్ ఇండస్ట్రీకి ఆయన భూమి పూజ చేశారు. ఈ యూనిట్ ద్వారా 1500 మంది మహిళలకు ఉపాధి లభించనుంది.
తొగర్‌పల్లిలో ఏర్పాటు చేయనున్న ఈ ఫుడ్ ఇండస్ట్రీ 44 ఎకరాల విస్తీర్ణంలో రూ.650 కోట్ల పెట్టుబడితో వస్తోంది. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, TGIIC చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పాల్గొన్నారు.
మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ, ఈ పరిశ్రమ ఏర్పాటుకు స్థానిక నాయకుల కృషిని ప్రశంసించారు. ఇది పూర్తిగా కాలుష్య రహితమని, స్థానిక ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని తెలిపారు. రాబోయే కాలంలో అంతర్జాతీయ కారిడార్‌లో మరిన్ని పరిశ్రమలను నెలకొల్పే యోచనలో ప్రభుత్వం ఉందని ఆయన వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించడానికి చురుగ్గా ప్రయత్నిస్తోందని, సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో అంతర్జాతీయ సదస్సుల్లో పాల్గొంటున్నామని మంత్రి చెప్పారు. 2047 నాటికి దేశ జాతీయ ఉత్పత్తిలో 10 శాతం వృద్ధిని సాధించే దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.
మంత్రి దామోదర రాజనర్సింహ మాట్లాడుతూ, సంగారెడ్డి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం ఉందని, ఈ ప్రాంత ప్రజలు అదృష్టవంతులని అన్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమలు వస్తే స్థానికులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా ఈ ప్రాజెక్ట్ విజయవంతం కావడానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.











