రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. ఫిబ్రవరి 13న జరగనున్న ఈ ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.
జిల్లా కేంద్రంలోని ఏఎంసీ గోడౌన్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్లతో కలిసి గురువారం పరిశీలించారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బిచ్కుంద మున్సిపాలిటీలలో ఓట్ల లెక్కింపు కేంద్రాలు సిద్ధం చేశారు.
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని 49 వార్డులకు రెండు రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది. మొదటి రౌండ్లో 32 వార్డులు, రెండో రౌండ్లో 17 వార్డుల ఓట్లను లెక్కిస్తారు. ఈ ప్రక్రియ కోసం జిల్లావ్యాప్తంగా 89 మంది సూపర్వైజర్లు, 178 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు విధులు నిర్వర్తిస్తారు.
కామారెడ్డి కౌంటింగ్ కేంద్రానికి ప్రత్యేకంగా 38 మంది సూపర్వైజర్లు, 114 మంది కౌంటింగ్ సహాయకులను నియమించారు. ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు అధికారుల మధ్య సమన్వయం ఉండేలా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. కౌంటింగ్ సిబ్బందికి ఇప్పటికే శిక్షణ తరగతులు నిర్వహించి, వారి బాధ్యతలపై అవగాహన కల్పించారు.


