జాతీయ లోక్ అదాలత్ను విజయవంతం చేయడానికి న్యాయవాదులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జి.భవానిచంద్ర పిలుపునిచ్చారు. ఈ నెల 28న సంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో, మంగళవారం సంగారెడ్డి కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులతో అవగాహన సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.భవాని చంద్ర మాట్లాడుతూ, రాజీ చేయదగిన పోలీస్ కేసులు, భార్యాభర్తల మధ్య చిన్నచిన్న వివాదాలు, ఎక్సైజ్ కేసులు, బ్యాంక్ కేసులు వంటి అనేక రకాల కేసులను లోక్ అదాలత్ ద్వారా సులభంగా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. విలువైన సమయాన్ని కోర్టుల చుట్టూ తిరగడంలో వృథా చేసుకోకుండా, సామరస్యపూర్వక పరిష్కారాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
న్యాయవాదులు తమ వంతు సహకారం అందించి, లోక్ అదాలత్ను విజయవంతం చేయాలని, అలాగే కక్షిదారులకు న్యాయమైన నష్టపరిహారం అందేలా చూడాలని ఆయన కోరారు.








