బాల్కొండ మండలంలోని అల్లకొండ ఖిల్లా వద్ద గత ఏడాది ఫిబ్రవరిలో పునాది పనుల సమయంలో లభ్యమైన పురాతన విగ్రహాల అదృశ్యంపై అధికారులు విచారణ చేపట్టారు. కరీంనగర్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ సాగర్ నేతృత్వంలోని బృందం స్థానిక అధికారులతో సమావేశమై సమాచారం సేకరించింది.
అల్లకొండ ఖిల్లా వద్ద గృహ నిర్మాణ పునాదులు తవ్వుతుండగా పురాతన విగ్రహాలు లభించాయి. అయితే, ఈ విగ్రహాలు అదృశ్యమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో, ఈ విషయంపై విచారణకు అధికారులు ఆదేశించారు. శనివారం కరీంనగర్ రీజినల్ జాయింట్ డైరెక్టర్ సాగర్, టెక్నికల్ అధికారి రవితేజ, జె. ఏ. గౌస్ బృందం బాల్కొండకు చేరుకుంది.
స్థానిక సర్పంచ్ గాండ్ల రాజేష్, ఉప సర్పంచ్ రాజేందర్ అధికారులను కలిసి, విగ్రహాల లభ్యత, వాటి అదృశ్యంపై జరిగిన పరిణామాలను వివరించారు. గత ఏడాది ఫిబ్రవరిలో ఖిల్లాకు సమీపంలో ఉన్న పెద్ద చెరువు కందకం ఒడ్డున గణేష్, నాగుపాము, లక్ష్మీదేవి విగ్రహాలు లభ్యమైనట్లు తెలిసింది.
అప్పట్లో స్థానికులు పూజలు నిర్వహించగా, పోలీస్ అధికారులు పురావస్తు శాఖకు సమాచారం ఇవ్వకుండానే విగ్రహాలను గోదావరి నదిలో వేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ విషయం రాష్ట్ర పురావస్తు శాఖ డైరెక్టర్ దృష్టికి వెళ్లడంతో, అధికారులు శనివారం స్థానిక ప్రాంతాల్లో విగ్రహాలను గుర్తించి, ఫోటోలు తీశారు. ఈ విషయాన్ని అల్లకొండ ఖిల్లా పరిరక్షణ సమితి కార్యనిర్వహక అధ్యక్షులు బ్రహ్మ రౌతు నర్సింగ్ రావు, సంయుక్త కార్యదర్శి డా. పవన్ కుమార్ ధృవీకరించారు.
ఖిల్లా అభివృద్ధి పనులపై కూడా అధికారులతో చర్చించారు. ముళ్ల పొదల తొలగింపు, పర్యాటకుల సౌకర్యార్థం రోడ్డు నిర్మాణం, విద్యుత్ స్తంభాల ఏర్పాటు వంటి అంశాలపై చర్చలు జరిగాయి. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబెర్స్ సందీప్ తదితరులు పాల్గొన్నారు.












