తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువతలో క్రీడా స్ఫూర్తిని, నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు, ఉద్యోగ అవకాశాలను కల్పించే లక్ష్యంతో 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక'లో భాగంగా 'యూత్ అండ్ స్పోర్ట్స్ థీమ్' కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
ఈ నెల 18 నుంచి 23 వరకు రాష్ట్రవ్యాప్తంగా మండల, జిల్లా స్థాయిల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించబడతాయి. జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమాల్లో యువత, స్వచ్ఛంద సంస్థలు, క్రీడా సంఘాలు పాల్గొనాలని సూచించారు.
కార్యక్రమంలో భాగంగా 18న 'ఫిట్ అండ్ యాక్టివ్ తెలంగాణ' పేరుతో మారథాన్, 19న కెరీర్, నైపుణ్యాభివృద్ధి, 20న నాయకత్వ లక్షణాలపై అవగాహన, 21న 'స్పోర్ట్స్ డే' నిర్వహించబడతాయి. ఇందుకు సంబంధించిన వేదికలను అధికారులు ప్రకటించారు.
22న స్వచ్ఛ తెలంగాణ కోసం యువత భాగస్వామ్యంతో శ్రమదానం, 23న ఉద్యోగ సాధన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాల ద్వారా యువతలో సామాజిక బాధ్యతను పెంచడంతో పాటు, వారి భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.











