తెలంగాణ పోస్టల్ సర్కిల్, దేవాదాయ శాఖ సహకారంతో ఈ శ్రీరామనవమి సందర్భంగా భద్రాద్రి శ్రీ సీతా రామచంద్రస్వామి కళ్యాణోత్సవానికి సంబంధించిన పవిత్ర తలంబ్రాలను భక్తుల గృహద్వారాల వద్దకు చేరవేయనుంది. దీని ద్వారా భక్తులు భద్రాద్రికి ప్రయాణించాల్సిన అవసరం లేకుండానే పవిత్ర తలంబ్రాలను పొందవచ్చు.
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పోస్టాఫీసుల ద్వారా భక్తులు ఈ ప్రత్యేక సేవను పొందవచ్చు. రెండు రకాల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి: 'అంతరాలయ అర్చన – కళ్యాణ తలంబ్రాలు' (రూ. 450/-) మరియు 'ముత్యాల తలంబ్రాలు' (రూ. 151/-). ఈ ప్యాకేజీలలో తలంబ్రాలతో పాటు ఇతర ఆధ్యాత్మిక వస్తువులు కూడా ఉంటాయి.
భద్రాద్రిలో మార్చి 27, 2026న జరగనున్న శ్రీ రామ నవమి మహోత్సవాలకు హాజరు కాలేని భక్తులకు ఈ సేవ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కళ్యాణోత్సవం అనంతరం, బుక్ చేసుకున్న భక్తులకు తలంబ్రాలు స్పీడ్ పోస్టు ద్వారా నేరుగా వారి ఇళ్లకు పంపిణీ చేయబడతాయి.
ఈ సేవ కోసం మార్చి 20, 2026 వరకు బుకింగ్ చేసుకోవచ్చని కామారెడ్డి తపాలా ఇన్స్పెక్టర్ సుజిత్ కుమార్ తెలిపారు. భక్తులు తమకు సమీపంలోని పోస్టాఫీసును సంప్రదించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


