ట్యాంక్ బండ్ వద్ద ప్రాణాలను కాపాడిన శివ కుటుంబానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న శివ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయంతో పాటు, ఆయన కుమారుడికి హోంగార్డు ఉద్యోగం కల్పించారు.
ఇటీవల ముఖ్యమంత్రి దృష్టికి చేరిన ట్యాంక్ బండ్ శివ దీన పరిస్థితి నేపథ్యంలో, ప్రభుత్వం తరపున సాయం అందించారు. ఉపాధి లేక కుటుంబ పోషణ భారమై ఇబ్బందులు పడుతున్న శివ కుటుంబానికి ముఖ్యమంత్రి స్వయంగా ఆర్థికసాయం అందజేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ శివ ఇంటికి వెళ్లి, రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. అదే సమయంలో, శివ కుమారుడు వేణుమాధవ్‌కు హోంగార్డు ఉద్యోగ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా శివ కుటుంబసభ్యులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
శివ తన ఉపాధి కోసం ట్యాంక్ బండ్ సమీపంలో ఒక స్విమ్మింగ్ పూల్ నిర్మించి ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఈ అభ్యర్థన మేరకు, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే, శివ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని కూడా సూచించారు.








