తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీకగా నిలిచిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 317వ వర్ధంతి సందర్భంగా ఆయనకు పలువురు నాయకులు ఘనంగా నివాళులర్పించారు. కూకట్పల్లిలోని ఎల్లమ్మబండ ఎన్టీఆర్ నగర్ కమాన్ వద్ద గల పాపన్న గౌడ్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమం జరిగింది.
శేరిలింగంపల్లి శాసనసభ్యులు, పి.ఎ.సి చైర్మన్ అరేకపూడి గాంధీ, హైదర్ నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ తో కలిసి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అరేకపూడి గాంధీ మాట్లాడుతూ, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక అని కొనియాడారు. బహుజన వీరుడైన పాపన్న, సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి స్ఫూర్తిగా నిలిచారని తెలిపారు.
ఆనాటి సమాజంలో నెలకొన్న నిరంకుశ రాజరిక పోకడలకు వ్యతిరేకంగా సబ్బండ వర్గాలను ఏకం చేసి, పాపన్న చేసిన పోరాటం గొప్పదని గాంధీ గుర్తు చేశారు. పాపన్న వీరగాథను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి కర్తవ్యమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.







