రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అధ్యక్షతన ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ఫిట్మెంట్ (పీఆర్సీ) వంటి అంశాలపై సుదీర్ఘ చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో భాగంగా ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది.
ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, వివేక్ వెంకట్ స్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీఎస్, అధికారులు, ఆర్టీసీ జేఏసీ నాయకులు పాల్గొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే కార్మికుల దశాబ్దాల నాటి డిమాండ్‌పై ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చించింది. ఈ విలీన ప్రక్రియకు సంబంధించి అధికారులతో కూడిన అధికారిక కమిటీని ప్రకటించింది.
ఆర్టీసీ కార్మికులకు 11 శాతం పీఆర్సీని ప్రభుత్వం ప్రకటించింది. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ వెసులుబాటును ఇరు పక్షాలు అర్థం చేసుకున్న తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. మిగిలిన ఆర్టీసీ సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ యాజమాన్యం, కార్మిక సంఘాలు చొరవ తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయాల నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించారు.
ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలు నిర్వహించుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని ఆదేశించింది. భవిష్యత్తులో ఆర్టీసీ సంస్థ దేశంలోనే ప్రజా రవాణాలో ముందుండాలని ఉప ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఉదయం ఐఏఎస్ అధికారులతో చర్చలు జరిపిన అనంతరం, ఉప ముఖ్యమంత్రితో మంత్రులు, అధికారులు, ఆర్టీసీ జేఏసీ నాయకులు సమావేశమయ్యారు.










