రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 99 రోజుల పాటు నిర్వహించనున్న 'ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక' కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను పారదర్శకంగా అందించడమే లక్ష్యమని ఆమె తెలిపారు.
సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల, రెవెన్యూ అధికారులు, మున్సిపల్ కమిషనర్లు కూడా ఈ సమావేశంలో భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించి, కార్యాచరణపై మార్గనిర్దేశం చేశారు.
గ్రామం నుండి జిల్లా స్థాయి వరకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేసి, నిర్దిష్ట కాలపరిమితిలో లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ అధికారులను సూచించారు. ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకతను పాటించాలని ఆమె నొక్కి చెప్పారు.
మార్చి 6 నుంచి జూన్ 12 వరకు పది అంశాలపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. వీటిలో పరిసరాల పరిశుభ్రత, పెండింగ్ ఫైళ్ల పరిష్కారం, ఆరోగ్య శిబిరాలు, రహదారి భద్రత అవగాహన, సంక్షేమ పథకాల అమలు, బాలల రక్షణ, రైతులకు సూచనలు, విద్యాభివృద్ధి, యువజన క్రీడలు, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాలు ఉన్నాయి.
ఈ 99 రోజుల కార్యాచరణను గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఐదు దశల్లో అమలు చేయనున్నట్లు వివరించారు. సమావేశంలో ఇంచార్జ్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పాండు, జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి డా.శివప్రసాద్, డీఆర్డీఓ జ్యోతి, డీడబ్ల్యూఓ లలితకుమారి, జిల్లా వైద్యాధికారి డా. వసంతరావు, హౌసింగ్ పీడీ చలపతిరావు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.


