పాలకుర్తి మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయం భూముల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను దేవాదాయ శాఖ అధికారులు అడ్డుకొని, వాటిని కూల్చివేశారు. ఆలయ భూముల్లో నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన భూముల్లో అక్రమంగా ఇళ్లు నిర్మిస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారులకు సమాచారం అందింది. వెంటనే స్పందించిన అధికారులు, సిబ్బంది శనివారం ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు.
సర్వే నంబర్లు 542, 543 పరిధిలోని ఆలయ భూముల్లో చేపడుతున్న నిర్మాణాలను వారు అడ్డుకున్నారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి (ఈఓ) భాగం లక్ష్మీ ప్రసన్న ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేవదాయ చట్టం 30/1987 ప్రకారం ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
అధికారుల ఆదేశాల మేరకు ఆలయ సిబ్బంది అక్రమంగా నిర్మిస్తున్న ఇంటి నిర్మాణాలను కూల్చివేశారు. ఈ చర్యల వల్ల అక్రమార్కుల్లో భయం నెలకొంది.
ఈ కార్యక్రమంలో దేవస్థానం సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, సిబ్బంది ముంజ రాములు, రమేష్, ఓం ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఆలయ భూములను కాపాడేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తామని తెలిపారు.











