నారాయణపేట జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బుధవారం ముగ్గురు హెడ్ కానిస్టేబుల్స్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ (ASI)లుగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ IPS వారికి "వన్ స్టార్"ను అలంకరించి అభినందనలు తెలిపారు. ప్రజలకు బాధ్యతాయుతంగా సేవలందించాలని ఆయన సూచించారు.
నారాయణపేట, దామరగిద్ద, మద్దూరు పోలీస్ స్టేషన్లకు చెందిన పి. బాలస్వామి, ఎస్. వెంకట్ రాములు గౌడ్, ఎం. వాసు రామ్ లు హెడ్ కానిస్టేబుల్ హోదా నుండి ASIలుగా పదోన్నతి పొందారు. పదోన్నతి పొందిన ముగ్గురు సిబ్బంది ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందజేశారు.
ఎస్పీ డాక్టర్ వినీత్ IPS మాట్లాడుతూ, పదోన్నతి అనేది కేవలం హోదా పెరుగుదల మాత్రమే కాదని, ఇది మరింత బాధ్యతను కూడా తెస్తుందని తెలిపారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు భరోసా, నమ్మకాన్ని కలిగించే విధంగా విధులు నిర్వహించాలని, ముఖ్యంగా నిరుపేదలు, బాధితులకు పోలీసులు అండగా నిలవాలని సూచించారు.
ప్రజలతో సానుభూతితో వ్యవహరించి, న్యాయం అందించే దిశగా కృషి చేయాలని, విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, సేవా భావం కలిగి ఉండాలని ఆయన పేర్కొన్నారు. ప్రజల నమ్మకం పొందడమే పోలీసుల ప్రధాన బాధ్యత అని, దీని కోసం ప్రతి పోలీస్ అధికారి ప్రజల పట్ల సానుకూల దృక్పథంతో పనిచేయాలని సూచించారు.
పదోన్నతి పొందిన ముగ్గురు ASIలు నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలకు బదిలీ అయ్యారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు నల్లపు లింగయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు.











