సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బహుజన చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 316వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి దామోదర్ రాజనర్సింహ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పాపన్న గౌడ్ ఆశయాలను తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తోందని తెలిపారు.
శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ద్వారా కొనసాగిస్తున్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. పాపన్న గౌడ్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ ప్రాంతానికి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అందించిన స్ఫూర్తిని, త్యాగాలను భవిష్యత్ తరాలకు తెలియజేసే విధంగా ఆయన నిర్మించిన కోటలను పర్యాటక, పురావస్తు కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు మంత్రి వివరించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, అదనపు జిల్లా కలెక్టర్ మాధురి, అదనపు జిల్లా కలెక్టర్ (స్థానిక సంస్థలు) పాండు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీష్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.












