రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు పథకం మహిళల ఆర్థిక, సామాజిక భద్రతను బలోపేతం చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతోందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఇప్పటికే రూ.10,000 కోట్లకు పైగా ప్రయాణ చార్జీలను ఆదా చేసుకున్నారని ఆయన వెల్లడించారు.
మంగళవారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని, మహిళా ప్రయాణికులను సన్మానించి, పథకం విజయాన్ని కొనియాడారు.
2023 డిసెంబర్లో ప్రారంభమైన ఈ పథకం మహిళల రోజువారీ ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తోందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో రూ.6.56 కోట్ల మేర ప్రయాణ ఖర్చులు తగ్గినట్లు, ఆదా చేసిన నిధులను మహిళలు కుటుంబ అవసరాలు, పిల్లల విద్య, ఆరోగ్యంపై వినియోగిస్తున్నారని వివరించారు.
ఉచిత బస్సు సదుపాయం మహిళలకు స్వేచ్ఛగా సంచరించే అవకాశం కల్పించడంతో పాటు, ఉద్యోగాలు, వ్యాపారాలు, వైద్య సేవల కోసం గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు చేరుకోవడాన్ని సులభతరం చేసిందని ఆయన అన్నారు. ప్రభుత్వం మహిళల అభివృద్ధి కోసం ‘ఇందిరా మహిళా శక్తి’ ద్వారా వ్యాపార అవకాశాలు, బ్యాంకు రుణాల సదుపాయం కూడా కల్పిస్తోందని తెలిపారు.
‘ఉల్లాస్’ కార్యక్రమం ద్వారా మహిళలకు విద్యా శిక్షణ అందించి పరీక్షలు నిర్వహించడం ద్వారా చదువుపై ఆసక్తి పెరుగుతుండటం సంతోషకరమని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. మహిళా ప్రయాణికులు మాట్లాడుతూ, ఉచిత బస్సు పథకం తమకు ఆర్థికంగా పెద్ద ఊరటనిచ్చిందని, ఆదా అయిన డబ్బు కుటుంబ అవసరాలకు ఉపయోగపడుతోందని పేర్కొన్నారు.












