జనాభా లెక్కల్లో కురుమలకు అన్యాయం జరుగుతోందని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రతి గ్రామపంచాయతీలో జనాభా లెక్కలకు సంబంధించిన పత్రాలను అందుబాటులో ఉంచాలని కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బింగి స్వామి డిమాండ్ చేశారు. కురుమల జనాభాను తక్కువగా చూపిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇకపై విశ్వసించలేమని ఆయన తీవ్రంగా విమర్శించారు.
కురుమ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు బింగి స్వామి సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ, జనాభా లెక్కల్లో కురుమలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రతి గ్రామపంచాయతీలో జనాభా లెక్కలకు సంబంధించిన పత్రాలను అందుబాటులో ఉంచాలని, ఆన్లైన్లో కూడా ప్రజలకు అందుబాటులో పెట్టాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం కురుమల జనాభాను కేవలం 7 లక్షల 95 వేలుగా చూపించడం కురుమ సమాజంపై ఉన్న వ్యతిరేకతకు నిదర్శనమని ఆయన అన్నారు. అసలు జనాభా చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ, ఉద్దేశపూర్వకంగా తగ్గించి చూపించడం ద్వారా వారి హక్కులను దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. వివిధ కులాల జనాభాలను కూడా ఎక్కువ-తక్కువగా చూపించినట్లు అనుమానాలున్నాయని పేర్కొన్నారు.
కురుమ సంఘం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం, ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్యపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కులాన్ని నమ్ముకొని ఎదిగిన వారు, ఇప్పుడు అదే కులాన్ని మోసం చేసే ద్రోహులుగా మారారని విమర్శించారు. నియోజకవర్గానికి 15 వేలకుపైగా కురుమ ఓటర్లు ఉన్నప్పుడు, మొత్తం జనాభా ఇంత తక్కువగా ఎలా ఉంటుందో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కురుమలు విద్యావంతులు కాకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నామని, కురుమ సమాజం విద్యావంతులుగా మారితే ఇలాంటి అన్యాయాలకు చెక్ పెట్టవచ్చని అన్నారు. త్వరలో కురుమ రిజర్వేషన్ల పోరాట సమితి ఆధ్వర్యంలో సమగ్ర కురుమల జనాభా లెక్కింపు చేపట్టి నిజాలను బయటపెడతామని బింగి స్వామి తెలిపారు. పై స్థాయి కాంగ్రెస్ నాయకులు ఈ అంశాన్ని సీరియస్గా తీసుకొని స్పందించాలని, లేనిపక్షంలో చరిత్రలో చెడు ముద్ర పడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.











