కామారెడ్డి పట్టణంలో ఏప్రిల్ 02న జరగనున్న హనుమాన్ జయంతి శోభాయాత్రను శాంతియుతంగా, సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, ఐఏఎస్, జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ మంగళవారం స్వయంగా ర్యాలీ మార్గాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ర్యాలీ మార్గాన్ని పరిశీలించిన అనంతరం, జిల్లా కలెక్టర్, ఎస్పీ అధికారులు, నిర్వాహకులతో సమావేశమయ్యారు. ర్యాలీ రూట్ మ్యాప్‌ను సమీక్షించి, కీలక కూడళ్ల వద్ద ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ర్యాలీ సాఫీగా సాగేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వివరంగా చర్చించారు.
కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన ప్రత్యేక సమావేశంలో, వేడుకలను క్రమశిక్షణతో నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. పట్టణంలోని ప్రధాన మార్గాల్లో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
శోభాయాత్ర సందర్భంగా డ్రోన్ కెమెరాలు, సీసీటీవీల ద్వారా నిరంతర నిఘా కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు, భక్తులు, నిర్వాహకులు పోలీస్ శాఖకు సహకరించి, వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు.












