జుక్కల్, ఎల్లారెడ్డి నియోజకవర్గాల ఎమ్మెల్యేలు తోట లక్ష్మీకాంతారావు, మదన్ మోహన్ రావు బుధవారం హైదరాబాద్లోని ప్రజా భవన్ లో రాష్ట్ర పంచాయితీ రాజ్ & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను కలిసి, తమ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల పురోగతితో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై వివరించారు.
ఎమ్మెల్యేలు మంత్రి సీతక్కకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి కావాలని, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు. స్థానిక వనరులను వినియోగించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, పోలీసు, అటవీ, పంచాయితీ రాజ్, రెవెన్యూ శాఖల అధికారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
లబ్ధిదారుల అవసరాలను మానవతా దృక్పథంతో చూడాలని, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని కూడా వారు కోరారు. ఈ అంశాలపై మంత్రి సీతక్క సానుకూలంగా స్పందించి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చడానికి అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయడం అత్యవసరమని మంత్రి ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. ఎమ్మెల్యేలు అందించిన సమాచారం ఆధారంగా తదుపరి కార్యాచరణ ఉంటుందని ఆమె తెలిపారు.












