రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన - ప్రజా ప్రణాళిక’ 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీ నుండి రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలను పెద్ద ఎత్తున నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం ప్రజాభవన్ నుండి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పలు సూచనలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభలు ఒకే విధంగా, సజావుగా జరిగేలా కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క మల్లు సూచించారు. ప్రతి గ్రామసభ ప్రారంభంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందేశాన్ని వినిపించి, అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించాలని తెలిపారు.
గ్రామసభల్లో ముఖ్యంగా రైతు భరోసా లబ్ధిదారుల వివరాలు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలను చదివి వినిపించాలి. జూన్ 2 నుండి అమలు చేయబోయే కొత్త జీవిత బీమా పథకంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న పాలు, రాగిజావ అల్పాహారం, ఇంటర్ విద్యార్థులకు ప్రారంభించిన మధ్యాహ్న భోజన పథకం వివరాలను కూడా తెలియజేయాలని సూచించారు.
గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులను విడుదల చేస్తోందని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. “ఏ గ్రామానికి ఎంత నిధులు విడుదలయ్యాయో గ్రామసభల్లో బహిరంగంగా ప్రకటించాలి. ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధిలోనూ ముందంజలో ఉందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి” అని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరువ చేయడంలో సాంస్కృతిక మరియు పౌర సంబంధాల శాఖల సహకారం తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు.
ప్రజా పాలన పురోగతిని ప్రధాన కార్యదర్శి, ప్రణాళికా శాఖలు నిరంతరం పర్యవేక్షిస్తాయని, క్షేత్రస్థాయిలో ఎక్కడా జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామసభల నిర్వహణతో ప్రభుత్వ పథకాల అమలు మరింత వేగవంతం అవుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి.







