రాష్ట్రంలో గౌడ కుల జనాభాను ఉద్దేశపూర్వకంగా తగ్గించి చూపిస్తున్నారని, తద్వారా రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందని జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోళ్ళ మురళి గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఇటీవల విడుదలైన సమగ్ర సర్వే నివేదికలోని గణాంకాలపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
రంగోళ్ళ మురళి గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది కుటుంబాలున్న గౌడ సమాజాన్ని తక్కువ సంఖ్యలో ఉన్నట్లు పేర్కొనడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని ఆరోపించారు. గ్రామాలు, మండలాలు, జిల్లాల్లో గౌడల సంఖ్య గణనీయంగా కనిపిస్తుండగా, వారిని మైనార్టీ వర్గంలా చూపించడం అనుమానాలకు తావిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
గౌడ సమాజం బలపడితే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుందని, బహుజన వర్గాల గొంతు మరింత బలంగా వినిపిస్తుందని, అందుకే ఆ వర్గాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని మురళి గౌడ్ పేర్కొన్నారు. చారిత్రాత్మకంగా పోరాట స్ఫూర్తి కలిగిన గౌడలు, మహారాజ్ పాపన్న గౌడ్ కాలం నుంచే దోపిడీ శక్తులకు వ్యతిరేకంగా పోరాడారని, స్వాతంత్ర్యోద్యమం, తెలంగాణ ఉద్యమాల్లోనూ కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు.
గౌడల సంప్రదాయ వృత్తి అయిన కల్లు, తాటి, ఈత చెట్ల ఆధారిత జీవన విధానాన్ని గత దశాబ్దాలుగా దెబ్బతీసే ప్రయత్నాలు జరిగాయని, వృత్తిని బలహీనపరిస్తే సమాజాన్ని బలహీనపరచవచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. ప్రమాదాలకు గురైన గౌడ కార్మికులకు సరైన పరిహారం అందడం లేదని, యువతకు విద్యా, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు పరిమితమవుతున్నాయని ఆయన తెలిపారు.
జనాభా లెక్కలపై అనుమానాలు నివృత్తి చేయాలంటే గ్రామాల వారీగా, మండలాల వారీగా పూర్తి నివేదిక విడుదల చేయాలని మురళి గౌడ్ డిమాండ్ చేశారు. రాష్ట్ర స్థాయి గణాంకాలు మాత్రమే వెల్లడించడం ద్వారా వాస్తవాలను దాచిపెడుతున్నారని ఆరోపించారు. ఈరోజు గౌడ సమాజంపై జరిగిన అన్యాయం రేపు ఇతర బీసీ, బహుజన వర్గాలపై కూడా జరగవచ్చని హెచ్చరించిన ఆయన, అన్ని బహుజన వర్గాలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు.












