తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దొడ్డి కొమరయ్య పాత్రను, ఆయన త్యాగాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్మరించుకున్నారు. రైతుల హక్కుల కోసం, అన్యాయాలకు వ్యతిరేకంగా ఆయన చేసిన పోరాటం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా సంగారెడ్డిలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి దామోదర రాజనర్సింహ, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు. పోతిరెడ్డిపల్లిలోని దొడ్డి కొమరయ్య విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సామాజిక న్యాయం, సమానత్వం కోసం దొడ్డి కొమరయ్య చూపిన మార్గాన్ని అనుసరించాలని, ఆయన స్ఫూర్తితో ప్రజాసేవలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. మహనీయుల ఆశయాలను సాకారం చేయడం ద్వారానే సమాజంలో నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ, తెలంగాణ రైతాంగ ఉద్యమానికి నాంది పలికిన అమరవీరుడు, రైతాంగ గళంగా నిలిచిన దొడ్డి కొమరయ్య గొప్ప నాయకుడని కొనియాడారు. యువత ఆయన జీవితం నుంచి ప్రేరణ పొంది సమాజానికి సేవ చేయాలని సూచించారు. సమానత్వం, న్యాయం, సౌభ్రాతృత్వం విలువలను పాటిస్తూ సమాజ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో శాసన సభ్యుడు చింతా ప్రభాకర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, వివిధ కుల, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.











