జిల్లాలో దివ్యాంగులు, వృద్ధులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా వికలాంగుల కమిటీ, జిల్లా సీనియర్ సిటిజన్స్ కమిటీ సమావేశాల్లో ఆయన ఈ విషయం స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సకాలంలో అందేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
జిల్లా వికలాంగుల కమిటీ సమావేశంలో సభ్యులు లేవనెత్తిన సమస్యలను సానుకూలంగా పరిశీలించిన కలెక్టర్, పెండింగ్లో ఉన్న అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా సంక్షేమ అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారికి సూచించారు. దివ్యాంగులకు ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాలు సులభంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లా సీనియర్ సిటిజన్స్ కమిటీ సమావేశంలో వృద్ధుల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై సమీక్ష జరిగింది. వృద్ధులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అవసరమైన సేవలు అందేలా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని, ఆర్డీవో పరిధిలో పెండింగ్లో ఉన్న మెయింటెనెన్స్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
వృద్ధుల హక్కుల పరిరక్షణతో పాటు వారి సమస్యలను సత్వరంగా పరిష్కరించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, సమస్యల పరిష్కారంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.












