తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బి. శివధర్ రెడ్డి, రోడ్డు ప్రమాదాల నివారణకు 'అరైవ్ అలైవ్' కార్యక్రమాన్ని ఉద్యమ తరహాలో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రామగుండం, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలలో ఆయన పర్యటించి, పలు పోలీస్ భవనాలను ప్రారంభించారు మరియు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు.
డీజీపీ బి. శివధర్ రెడ్డి రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాల వల్ల జరుగుతున్న మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించడం అత్యవసరమని పేర్కొన్నారు. ప్రజల్లో ట్రాఫిక్ నియమాలపై విస్తృత అవగాహన కల్పించడంతో పాటు, ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. "వేగం కన్నా ప్రాణం ముఖ్యం" అనే సందేశాన్ని ప్రతి ఒక్కరికీ చేరేలా చూడాలని, 'అరైవ్ ఆ లైవ్' కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో అవగాహన సదస్సులు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించి ప్రజలను చైతన్యపరచాలని డీజీపీ ఆదేశించారు. డిఫెన్సివ్ డ్రైవింగ్‌పై ప్రత్యేక శిక్షణలు నిర్వహించడం, సీట్ బెల్ట్ మరియు హెల్మెట్ వినియోగాన్ని తప్పనిసరిగా పాటించేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ట్రాఫిక్ నియమాల పట్ల నిర్లక్ష్యం ప్రాణాంతక పరిణామాలకు దారితీస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
గోదావరిఖని ఐబీ కాలనీలో రూ. 12.29 కోట్ల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక పోలీస్ నివాస సముదాయాన్ని డీజీపీ ప్రారంభించారు. అనంతరం మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు. బెల్లంపల్లి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో నిర్వహించిన 'అరైవ్... అలైవ్' అవగాహన సదస్సులో మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు నేడు ఒక సామాజిక సమస్యగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించడం తప్పనిసరి చేయాలని, మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠినంగా ఉండాలని సూచించారు.
అసిఫాబాద్ జిల్లాలోని రెబ్బెనలో పాత పోలీస్ స్టేషన్ భవనాన్ని ఆధునిక గ్రంథాలయంగా తీర్చిదిద్ది ప్రారంభించారు. ఆసిఫాబాద్ పట్టణ చెక్‌పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన భారీ 'హెల్మెట్ చౌక్'ను డీజీపీ ఆవిష్కరించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం ప్రాణ రక్షణ కవచమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 1,000 మంది వాహనదారులకు హెల్మెట్లను, 50 మంది ఆదివాసీ మహిళలకు కుట్టు మిషన్లను పంపిణీ చేశారు.










