కాంగ్రెస్ పార్టీని వీడిన సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. జగిత్యాలలో కాంగ్రెస్ ముఖ్య నాయకులతో సమావేశమైన ఆయన, జీవన్ రెడ్డి నిర్ణయాన్ని కార్యకర్తల వెన్నుపోటుగా అభివర్ణించారు.
జగిత్యాల ముఖ్య నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, ఇటీవల కాంగ్రెస్ పార్టీని వీడిన జీవన్ రెడ్డి వ్యవహారంపై ఆయన తన అభిప్రాయాలను వెలిబుచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను కార్యకర్తలతో పంచుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.
జీవన్ రెడ్డి పార్టీని వీడటంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 'మేం ఎప్పుడూ జీవన్ రెడ్డి గారిని తక్కువ చేసి చూడలేదు, ఆయన గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడలేదు' అని ఆయన పేర్కొన్నారు. గత ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం పార్టీ శ్రేణులు కృషి చేశాయని, పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ నుంచి పోటీ చేయాలని సూచించినా, నిజామాబాద్ నుంచి పోటీ చేయాలన్న ఆయన అభ్యర్థన మేరకు టికెట్ ఇచ్చామని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆయన సూచించిన వారికే టికెట్లు ఇచ్చామని, భవిష్యత్తులో ఆయన రాజకీయ భవిష్యత్ కు హామీ ఇచ్చినా పార్టీని వీడారని అన్నారు.
'మొండి పట్టుతో జీవన్ రెడ్డి గారు పార్టీ వీడారు. 40 ఏళ్లు ఆయన కోసం పనిచేసిన కార్యకర్తలను మోసం చేసి, దుర్మార్గుడైన కేసీఆర్ తో జతకట్టారు. జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి కేసీఆర్ దగ్గర చేతులు కట్టుకుని నిలబడటం అత్యంత బాధాకరం. జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారు' అని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆయన వయసుకు, అనుభవానికి ఇది తగదని అన్నారు.
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అలాంటి పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలబడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. త్వరలోనే జగిత్యాలకు వచ్చి కార్యకర్తలను కలుస్తానని, అందరూ కలిసికట్టుగా జగిత్యాల అభివృద్ధికి పాటుపడదామని ఆయన భరోసా ఇచ్చారు. వ్యక్తి కంటే పార్టీ ముఖ్యమని నిరూపించిన కార్యకర్తలను ఆయన అభినందించారు. కాలమే ఎవరు ఏమిటో నిర్ణయిస్తుందని ఆయన అన్నారు.











