చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే నారీశక్తి వందన్ అధినియం బిల్లును ప్రవేశపెడుతున్న సందర్భంగా, బీజేపీ మహిళా మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్లో బుధవారం స్కూటీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న మహిళా రిజర్వేషన్ల బిల్లును తీసుకురావడం ద్వారా మోదీ ప్రభుత్వం నవభారతాన్ని నిర్మిస్తోందని బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ అన్నారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశంలో నారీశక్తి వందన్ అధినియం బిల్లును ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో, ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఎస్ఆర్ఆర్ కళాశాల నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ, పట్టణంలోని పలు ప్రాంతాల మీదుగా మార్కెట్ ఫెడ్ వరకు కొనసాగింది. జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, నగర మేయర్ కోలగని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు ఈ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కల నెరవేరే సమయం వచ్చిందని జయశ్రీ పేర్కొన్నారు.
దేశాన్ని ఏలిన ఏ పార్టీ కూడా మహిళల సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారించలేదని, కానీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం మహిళల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తుందని ఆమె తెలిపారు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించడానికి, 33 శాతం రిజర్వేషన్లు అందించే చారిత్రాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఆమె అన్నారు.
చారిత్రాత్మక నారీ శక్తి వందన్ అధినియం బిల్లుతో దేశ ప్రధాని మహిళలకు ఒక గొప్ప కానుక ఇవ్వబోతున్నారని జయశ్రీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.











