కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలం పేట గ్రామానికి చెందిన బహుజన నాయకులు, కాంగ్రెస్ నాయకుడు పల్లె రమేష్ గౌడ్ పై వచ్చిన ఆరోపణలను ఖండించారు. ఆయనపై చేసిన ఫిర్యాదును వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే దళిత, బహుజనుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.
జిల్లా కేంద్రంలోని ఆర్. అండ్. బి. అతిథి గృహంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బహుజన నాయకులు మాట్లాడుతూ, పల్లె రమేష్ గౌడ్ ప్రజా సేవకుడని, ఆయన దళితులను అవమానించే వ్యక్తి కాదని స్పష్టం చేశారు. కులమతాలకు అతీతంగా అందరితో కలిసి ఉండే వ్యక్తిపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు.
గ్రామంలో ఏవైనా సమస్యలుంటే స్థానికంగా పరిష్కరించుకోవాలని, కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయడం తగదని నాయకులు సూచించారు. రాజకీయ విభేదాల నేపథ్యంలో కొందరిని పురికొల్పి కేసులు పెట్టించడం మంచి పద్ధతి కాదని ఫరీద్ పేట గ్రామ సర్పంచ్ నర్సింహ రెడ్డిని ఉద్దేశించి అన్నారు.
గ్రామంలో జరిగే సీతారాముల కళ్యాణోత్సవంలో దళితులకు ప్రాధాన్యత ఇస్తూ, వారిని గౌరవించిన రమేష్ గౌడ్ పై దళితులను కించపరిచేలా మాట్లాడారని ఆరోపించడం సిగ్గుచేటని నాయకులు అభిప్రాయపడ్డారు. గ్రామాభివృద్ధిలో ఆయన పాత్రను గుర్తు చేశారు.
రమేష్ గౌడ్ పై చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనియెడల తమ నిరసన రూపంలో ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. అనంతరం ఈ విషయమై ఏఎస్పి చైతన్య రెడ్డికి ఫిర్యాదు చేశారు.












