దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చే ప్రయత్నంలో భాగంగా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారని లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లుపై జరుగుతున్న చర్చలో పాల్గొంటూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మహిళలే దేశానికి చోదక శక్తులని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఇప్పటికే 2023లో మహిళా బిల్లును ఆమోదించుకున్నామని, ఇప్పుడు కొత్తగా బిల్లు తీసుకురావాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుత మహిళా బిల్లు ముసుగులో దేశ రాజకీయాలను మార్చే ప్రయత్నం జరుగుతోందని ఆయన విమర్శించారు. ఈ బిల్లు బీసీ, దళితులు, మైనారిటీలు, మహిళల పట్ల క్షమించరాని క్రూరమైన చర్య అని ఆయన అన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ బిల్లుపై మరింత లోతైన చర్చ అవసరమని ఆయన సూచించారు.











