పరకాల నియోజకవర్గ స్థాయి ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక సమావేశంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలుపై ఆమె సమీక్షించారు.
పరకాల నియోజకవర్గంలో ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికపై నిర్వహించిన సమావేశంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కావ్య మాట్లాడుతూ, ప్రజాపాలనలో పారదర్శకత, ప్రజలకు అందుబాటులో ఉండే సేవలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలని తెలిపారు. పరకాల నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు, తాగునీరు, విద్యుత్, ఆరోగ్య సేవలను మెరుగుపరచడానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ప్రతి పథకం నేరుగా లబ్ధిదారులకు చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా స్పందించే పరిపాలన అవసరమని, ఇందుకోసం స్థానిక నాయకులు, అధికారులు కలిసి పనిచేయాలని కావ్య తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచే దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, మహిళా సాధికారతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని, పరకాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడం అందరి బాధ్యత అని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక ద్వారా అన్ని వర్గాలకు న్యాయం చేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని, రైతులు, విద్యార్థులు, మహిళలు, వ్యాపారస్తులకు అండగా నిలిచేలా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా, కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం ద్వారా మహిళల ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యత ఇస్తోందని, వారికి వివిధ వ్యాపార అవకాశాలు కల్పిస్తూ, బ్యాంకు లింకేజీ ద్వారా భారీ స్థాయిలో రుణాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల విషయంలో విఫలమైందని విమర్శించిన కావ్య, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి 3600 ఇళ్లను మంజూరు చేసిందని, అలాగే 500కే గ్యాస్, గృహజ్యోతి, మహాలక్ష్మి, రైతు భరోసా వంటి పథకాలను సమర్థంగా అమలు చేస్తున్నామని తెలిపారు.
అలాగే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలివరీలు పెరగాల్సిన అవసరం ఉందని, దీనిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అంగన్వాడీ టీచర్లు పిల్లలకు ‘గుడ్ టచ్ - బ్యాడ్ టచ్’పై అవగాహన కల్పించాలని, మానసిక ఎదుగుదలను దృష్టిలో పెట్టుకొని శిక్షణ ఇవ్వాలని చెప్పారు. హెల్త్ సబ్ సెంటర్ల పనులను వెంటనే ప్రారంభించాలని, భూముల సమస్యలను చూపిస్తూ పనులు వాయిదా వేయకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్‌ను త్వరితగతిన ప్రారంభించేందుకు కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నామని, నిధుల కేటాయింపుపై ఆరా తీసినట్లు తెలిపారు. ఎన్పీడీసీఎల్ అధికారులు సిఎస్ఆర్ నిధులను విద్య, వైద్యం, మహిళా సంక్షేమ రంగాలకు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గత పదేళ్లలో రేషన్ కార్డుల మంజూరులో నిర్లక్ష్యం జరిగిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తోందని, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ప్రజలకు ఉపయోగపడే పనులు చేయలేదని విమర్శించారు. పరకాల నియోజకవర్గంలో డైరీ ప్రాజెక్టు ఏర్పాటుకు తన వంతు సహకారం అందిస్తానని ఎంపీ కడియం కావ్య హామీ ఇచ్చారు.









