బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై హనుమకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యలను 'దయ్యాలు వేదాలు వల్లించినట్లు' ఉన్నాయని ఆయన ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలపై కేటీఆర్ చేసిన విమర్శలను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ ఖండించారు. శనివారం జరిగిన బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సుపై నాయిని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ ఒక నకిలీ విత్తనాలు అమ్మే ముఠా అని, వారి హయాంలో 7 వేల మంది రైతులు మరణించారని ఆయన గుర్తుచేశారు. రైతులపై ఎఫ్ఐఆర్ చేయించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని, రైతులను నట్టేట ముంచిన చరిత్ర వారిదని ధ్వజమెత్తారు.
ధరణి పోర్టల్‌ను అడ్డంపెట్టుకుని రాష్ట్ర సంపదను దోచుకున్నారని నాయిని రాజేందర్ ఆరోపించారు. 'స్క్రిప్ట్ రాసిస్తే చదవడం కాదు, దమ్ముంటే ఆధారాలతో మాట్లాడాలి. రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి నీది?' అని ఆయన కేటీఆర్‌ను ప్రశ్నించారు.
ఒకప్పుడు మీ కుటుంబం సోనియా గాంధీ చుట్టూ తిరిగారని పేర్కొన్న నాయిని, కేటీఆర్ వెంట ఉన్న వాళ్లంతా దోపిడీదారులేనని ఆరోపించారు. తన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి హనుమకొండ చౌరస్తాకు వస్తావా అని సవాలు విసిరి, రైతులను నట్టేట ముంచింది బీఆర్ఎస్ పార్టీయేనని, తన ప్రశ్నలకు కాకుండా, ముందు తన చెల్లెలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.







