హైదరాబాద్లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడటంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భానుప్రకాశ్ కోగంటి తీవ్రంగా స్పందించారు. మీడియా సంస్థలపై దాడులు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తాయని ఆయన పేర్కొన్నారు.
మంగళవారం నాడు 'వీకెండ్ కామెంట్ బై ఆర్కే' కథనంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ఆందోళన ముసుగులో వైసీపీ శ్రేణులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనపై భానుప్రకాశ్ కోగంటి తీవ్ర ఖండన వ్యక్తం చేశారు.
మీడియా అనేది సమాజానికి సమాచారాన్ని అందించే ఒక కీలక వేదిక అని, ప్రభుత్వ విధానాలను, ప్రజా సమస్యలను ప్రతిబింబించడంలో దాని పాత్ర ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు. మీడియా సంస్థలు స్వతంత్రంగా పనిచేస్తూ సమాచారాన్ని అందిస్తాయని, అలాంటి సంస్థలపై దాడులు చేయడం దుర్మార్గమని ఆయన అభివర్ణించారు.
రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అనేక మార్గాలున్నాయని, మీడియా సంస్థలను అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని భానుప్రకాశ్ కోగంటి సూచించారు. ప్రజా సమస్యలపై పోరాడితే ప్రజలు అంగీకరిస్తారని, మీడియాపై దాడులు ఆలోచనా స్వేచ్ఛను హరించడమేనని ఆయన స్పష్టం చేశారు.











