కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్ర చేస్తోందని, పేదల ప్రయోజనాలను దెబ్బతీస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఈ మేరకు ఆమె మంగళవారం ఒక వీడియో సందేశం విడుదల చేశారు.
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ, వారి జీవనోపాధిని దెబ్బతీస్తోందని కవిత విమర్శించారు. ఉపాధి హామీ పథకం కింద పని దినాలను తగ్గించడం, నిధుల కేటాయింపులను నిలిపివేయడం వంటి చర్యల ద్వారా పేదల నోటికాడి కూడు లాగేసుకుంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పథకాన్ని చట్టబద్ధత లేకుండా చేసి, నిధులు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని ఆమె అన్నారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఉపాధి హామీ పథకం ఎంతో కీలకమని, అయితే కేంద్రం చర్యల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో పేదల ఆదాయం తగ్గుతోందని కవిత తెలిపారు. తెలంగాణలో 2021-22లో 14 కోట్ల పని దినాలు కల్పించగా, గత ఏడాది అవి 7 కోట్లకు తగ్గాయని ఆమె గణాంకాలను ఉటంకిస్తూ కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.
ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కార్మిక చట్టాలను అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ పథకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని ఆమె పిలుపునిచ్చారు.
తెలంగాణ నుంచి గెలిచిన బీజేపీ ఎంపీలు ప్రజల ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో ఎందుకు పోరాడటం లేదని కవిత ప్రశ్నించారు. తక్షణమే కేంద్రం నుంచి ఉపాధి హామీకి రావాల్సిన నిధులను తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు.











