తెలంగాణ రాష్ట్ర ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కేరళలో జరుగుతున్న శాసనసభ ఎన్నికల నేపథ్యంలో త్రిస్సూర్ జిల్లాలో కాంగ్రెస్ అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు.
సోమవారం నాడు, మంత్రి శ్రీధర్ బాబు త్రిస్సూర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జోసెఫ్ తాజెట్ తో కలిసి ఒల్లూర్, నట్టిక, కైపమండలం, పుదుక్కాడ్, చలకుడి, కోడుంగల్లూర్, మనలూర్ వంటి పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ ప్రచారం రెండు రోజుల పాటు కొనసాగింది.
త్రిస్సూర్ జిల్లాలో మొత్తం 13 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. గత 2021 అసెంబ్లీ ఎన్నికల్లో, కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ కూటమి ఈ జిల్లాలో కేవలం రెండు స్థానాలను మాత్రమే గెలుచుకుంది. ప్రస్తుత ఎన్నికల్లో అధికార ఎల్డీఎఫ్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో, త్రిస్సూర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లను గెలుచుకునే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
పగలంతా ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న మంత్రి శ్రీధర్ బాబు, రాత్రి వేళల్లో త్రిస్సూర్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులతో పలుమార్లు సమావేశమయ్యారు. పార్టీ విజయం కోసం అందరూ సమష్టిగా కృషి చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
మహారాష్ట్రలోని పశ్చిమ నాగపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే మరియు నాగపూర్ డిసిసి అధ్యక్షుడు వికాస్ ఠాక్రే, సోమవారం నాడు మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి, ఎన్నికల ప్రచార తీరుతెన్నులపై చర్చించారు.











