తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గురువారం హైదరాబాద్లో విలేకరుల సమావేశం నిర్వహించి, తెలంగాణలో, ముఖ్యంగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలలో తీవ్రమైన అవినీతి జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నామినేషన్ పద్ధతిలో టెండర్లు కట్టబెడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోందని ఆమె విమర్శించారు.
కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలలో పనులు టెండర్ల ద్వారానే ఇవ్వాలని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం నామినేషన్ పద్ధతిలో 1,148 కోట్ల రూపాయల పనులు అప్పగించిందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే పద్ధతిలో 480 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చిందని, అయితే ప్రస్తుత ప్రభుత్వం ఆ మొత్తాన్ని మించి అవినీతికి పాల్పడుతోందని ఆమె అన్నారు. ఈ పద్ధతి తెలంగాణ స్టేట్ ఫైనాన్షియల్ కోడ్ కు పూర్తిగా విరుద్ధమని ఆమె పేర్కొన్నారు.
50 కోట్ల రూపాయలకు మించిన పనులకు తప్పనిసరిగా టెండర్లు పిలవాలని, తద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని కవిత తెలిపారు. హెచ్ఎండీఏ పరిధిలో 35 వేల కోట్ల రూపాయల ఫ్లాట్లను హైదరాబాద్ అభివృద్ధి కోసం అమ్మినప్పటికీ, ఆ డబ్బులు నగర అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడలేదని ఆమె ఆరోపించారు. నామినేషన్ పద్ధతిలో కాంట్రాక్టులు ఇవ్వవద్దని 2023లోనే ఒక కమిటీ స్పష్టం చేసిందని ఆమె గుర్తుచేశారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారులను బెదిరించి, స్క్వేర్ ఫీట్ కు 150 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని కవిత ఆరోపించారు. ఈ బెదిరింపులు వెంటనే ఆపాలని, లేదంటే వారి అవినీతి బాగోతాన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి అందజేస్తామని ఆమె హెచ్చరించారు. జీహెచ్ఎంసీ అంటే గుంపు మేస్త్రీ హయాంలో జరుగుతున్న మహా కరెప్షన్ అని ఆమె అభివర్ణించారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయాలని, దాని భవిష్యత్తును నాశనం చేయవద్దని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ మరమ్మత్తులను కమీషన్ల కోసమే చేస్తున్నారని కవిత ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విఫలమైందని చెప్పడానికి ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టిన ప్రభుత్వం ఇది అని ఆమె విమర్శించారు. మహిళా బిల్లుకు 2011 జనాభా లెక్కలను ప్రతిపాదనగా తీసుకోవడం మోసం చేయడమేనని, బీజేపీ మరోసారి తన బీసీ వ్యతిరేకతను చాటుకుంటోందని ఆమె అన్నారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తన గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు.










