అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, భారత మూలాలున్న తన అత్తింటి కుటుంబంపై ప్రశంసలు కురిపిస్తూ, అమెరికా ఆర్థిక వ్యవస్థలో వలసదారుల పాత్రను కొనియాడారు. అయితే, ఇమిగ్రేషన్ ప్రోగ్రామ్స్‌పై కఠిన నియంత్రణ అవసరాన్ని కూడా ఆయన సమర్థించారు.
జార్జియా విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ, అమెరికాను సుసంపన్నం చేయడంలో, దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడంలో వలసదారులు ఒక నిదర్శనంగా నిలిచారని వాన్స్ పేర్కొన్నారు. వలసదారులు అమెరికా ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన అన్నారు. అదే సమయంలో, ఇమిగ్రేషన్ ప్రోగ్రామ్స్‌పై కఠిన నియంత్రణ అవసరాన్ని కూడా ఆయన సమర్థించారు.
అమెరికా పౌరసత్వం పొందడం అంటే ఈ దేశ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వడమేనని ఆయన స్పష్టం చేశారు. హెచ్-1బీ వీసా వ్యవస్థలో మోసాలు జరుగుతున్నాయని తాను భావిస్తున్నట్లు వాన్స్ తెలిపారు. తాను వివాహం చేసుకున్న ఉషా చిలుకూరి కుటుంబం భారత్ నుంచి వచ్చినవారని, తన అత్తమామలు గొప్ప వ్యక్తులని, అమెరికాకు ఎంతో సేవ చేశారని ఆయన వ్యాఖ్యానించారు.
తన మామగారు భారత్ నుంచి వచ్చి ఇక్కడ చదువుకొని, అమెరికా పౌరుడిగా మారారని, అమెరికా ప్రయోజనాల కోసమే పాటుపడ్డారని ఆయన అన్నారు. హెచ్-1బీ వీసాలపై అమెరికాలో నివసిస్తున్నవారు గ్రీన్‌కార్డ్ కోసం సుదీర్ఘకాలం వేచి చూడాల్సి వస్తోందన్న భారత సంతతి వ్యక్తి ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు.
ఇరాన్‌తో చర్చల అంశంపై మాట్లాడుతూ, రెండు దేశాల మధ్య ఉన్న అపనమ్మకం రాత్రికి రాత్రి తొలగిపోయేది కాదని వాన్స్ అన్నారు. ఇరాన్ ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకోవాలని కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో ఈ సంప్రదింపులు జరగొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే.







