ప్రముఖ జాతీయ దినపత్రిక 'ఇండియన్ ఎక్స్ప్రెస్' తాజాగా ప్రకటించిన ‘IE 100: 2026’ అత్యంత శక్తిమంతమైన భారతీయుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు స్థానం సంపాదించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, జనసేనాని పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
దేశ గమనాన్ని శాసించగల 100 మంది ప్రముఖులతో రూపొందించిన ఈ జాబితాలో తెలుగు నేతలకు ప్రాధాన్యత లభించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 13వ స్థానంలో నిలిచి, అత్యంత శక్తిమంతమైన తెలుగు నాయకుడిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటులో ఆయన పాత్ర, ఏపీ పునర్నిర్మాణంలో చూపుతున్న చొరవ ఆయన జాతీయ స్థాయి ఇమేజ్ను పెంచాయని నివేదిక పేర్కొంది.
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఈ జాబితాలో 25వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ తర్వాత అత్యంత ప్రభావశీలుడైన నేతగా ఆయన గుర్తింపు పొందారని, జాతీయ స్థాయిలో ఆయన నాయకత్వ పటిమ, పరిపాలనా దక్షత దీనికి నిదర్శనమని నివేదిక తెలియజేసింది. దక్షిణాదిలో కాంగ్రెస్ పార్టీకి ఆయన బలమైన గళంగా అవతరించారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ 68వ స్థానంలో నిలిచి, క్షేత్రస్థాయిలో ఓట్లను ప్రభావితం చేయగల, విధానపరమైన నిర్ణయాల్లో పాలుపంచుకోగల జాతీయ స్థాయి నాయకుడిగా గుర్తింపు పొందారు. ఇదే క్రమంలో కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు 90వ స్థానంలో నిలవడం, కేంద్ర క్యాబినెట్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన యువ నాయకత్వ ఎదుగుదలకు సంకేతంగా నిలిచింది.
ఈ జాబితాలో బీఆర్ఎస్, వైసీపీ అగ్రనేతలు చోటు దక్కించుకోలేకపోవడం గమనార్హం. కేసీఆర్, జగన్ మోహన్ రెడ్డి ఈ జాబితాలో లేకపోవడం వారి పలుకుబడి భారీగా తగ్గిపోవడానికి సంకేతంగా నివేదిక పరోక్షంగా సూచిస్తోంది. అధికారం కోల్పోయిన తర్వాత జాతీయ స్థాయిలో ఆయా పార్టీల ప్రభావం నామమాత్రంగా మారిందని, ప్రస్తుతం తెలుగు రాజకీయాల కేంద్రబిందువు కూటమి ప్రభుత్వం, కాంగ్రెస్ వైపు మళ్లిందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.











